సమత కేసు తుది తీర్పు వాయిదా..

సమత హత్యాచారం కేసును ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు ప్రాసిక్యూషన్‌ తెలిపింది. న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవుపై వెళ్లినట్లు ప్రాసిక్యూషన్‌ వెల్లడించింది. తుది తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రాసిక్యూషన్‌ ధర్మారెడ్డి తెలిపారు. కాగా, సమత కేసు సోమవారం ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టులో తుది తీర్పు వెల్లడికి షెడ్యూల్‌ ఖరారు చేశారు. కానీ, న్యాయమూర్తి అనారోగ్యానికి గురవడంతో తీర్పు వాయిదా పడింది. 




గత ఏడాది నవంబర్‌ 24న కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ గ్రామ అటవీ ప్రాంతంలో  సమతపై అదే గ్రామానికి చెందిన షేక్‌ బాబా, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ మగ్దూమ్‌లు సామూహిక హత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును వేగంగా విచారించేందుకు డిసెంబర్‌ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటైన విషయం తెలిసిందే. కాగా, నిందితుల తరఫున వాదించడానికి న్యాయవాదులెవరూ ముందుకు రాకపోవడంతో కోర్టు న్యాయవాదిని కేటాయించింది.